- టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
నిజామాబాద్, వెలుగు : ‘సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిజామాబాద్ నగరానికి చేర్చాలన్న తపనతోనే మజ్లిస్, బీఆర్‌ఎస్ తో కలిశాం’ అని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని, ఈ పొత్తు మేయర్ ఎన్నిక వరకే పరిమితం అని స్పష్టం చేశారు. సోమవారం నిజామాబాద్‌లో ఆయన మాట్లాడారు.
కూరగాయలు, పండ్లు అమ్ముకునే సాధారణ మహిళను మేయర్ పీఠంలో కూర్చోబెట్టి చరిత్ర సృష్టించామన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని సూచించారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి కోసం కుట్రలు చేసిన బీజేపీకి ప్రజలు షాక్ ఇచ్చారన్నారు. నిజామాబాద్‌లో 27 స్థానాల్లో గెలుస్తామని అంచనా వేశామని, కానీ బీజేపీ విభజన పాలిటిక్స్ కొంత ప్రభావం చూపించాయన్నారు.
